హనుమాన్‌జయంతి
శ్రీరామచంద్రుని భక్తాగ్రేసరుల్లో ఆంజనేయ స్వామి అగ్రగణ్యుడు. ప్రభువు పట్ల హనుమ ప్రదర్శించిన భక్తి అనన్యం. రామాయణంలో సీతాన్వేషణలో శ్రీరామునికి ఇతోధికంగా సాయపడిన వానరుడు హనుమంతుడు. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఆయన అంజనాదేవి, కేసరి దంపతులకు జన్మించాడు. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టడంతో అశేష బలసంపన్నుడిగా అవతరించారు. లంకకు చేరి సీతామహాదేవి జాడను కనుగొన్నది ఆయనే. ఎంత శక్తివంతుడైనా శ్రీరామ నామ జపమే ఇష్టాక్షరి మంత్రంగా చేసుకున్న గొప్పభక్తుడు. చిరంజీవిగా వుంటూ శ్రీరామనామం శబ్దం విన్నంతనే అక్కడకు ప్రత్యక్షమవుతాడని కోట్లాది భక్తుల నమ్మకం. అతిబలవంతుడైన హనుమంతుడు మనో వేగంతో ప్రయాణించగలడు. అంతటి శక్తి ఆ స్వామికే సాధ్యం. చిన్నతనంలో సూర్యుడిని చూచి అందుకోవాలని వెళ్లగా సూర్యుని వేడిమికి ఆయన దవడలు ఎర్రబారాయి. అందుకే హనుమ అంటారు. ఆయనను నిత్యం ప్రార్థిస్తే శని కూడా మన ఛాయకు రాదని పెద్దలు అంటారు. రావణబ్రహ్మ శనిని లంకలో బంధించివుంచాడు. సీతమ్మ జాడ తెలుసుకునేందుకు హనుమంతుడు రావణ అంతఃపురంలోని ఒక్కొక్కగది తెరుస్తాడు. ఈ క్రమంలోనే శనిదేవున్ని బంధించిన గది తాళం తీస్తాడు. దీంతో శని రావణుడి నుంచి విముక్తి పొందినట్టు పురాణగాథలు పేర్కొంటున్నాయి. అందుకనే అంజనీపుత్రున్ని సేవిస్తే శని నీడ మనపై పడదు. అందుకనే భవిష్యత్ కల్పంలో ఆయన బ్రహ్మగా బాధ్యతలు నిర్వహించనున్నారు. అందుకనే స్వామివారిని భవిష్యత్ బ్రహ్మగా కొలుస్తాం. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చైత్రశుద్ధ పౌర్ణమినాడు హనుమజ్జయంతిని నిర్వహిస్తారు. మరికొన్నిప్రాంతాల్లో వైశాఖ మాసంలో నిర్వహిస్తారు. ఈ విధంగా రెండు సార్లు ఆ మహాబలుని జన్మదినాన్ని పండగగా జరుపుకొంటారు.
Comments
Post a Comment