తొండరడిప్పొడి ఆళ్వారు రచించిన తిరుప్పళ్లియొజుచ్చి.
దివ్యమైన మేలుకొలుపు
- సూర్యుడు తూర్పు దిక్కున ఆకాశపు ఉదయగిరిన అందమైన అరవింద ప్రకాశ తేజోమయుడై వచ్చివున్నాడు. ఉదయకాలపు వెలుతురు చక్కగా రాగా, దట్టమైన చిమ్మ చీకటి అంతా నశించినది. మంచి పరిమళపు సువాసనలు వెదజల్లు రంగురంగుల పువ్వులు అన్నీ వికసించి తియ్యని తేనెతో నిండి పలకరిస్తున్నవి. నీ దర్శనమునకై దేవతలు, రాజులు అందరూ వచ్చి అన్ని వైపులా నిండి వున్నారు. వారు ఎక్కి వచ్చిన ఏనుగుల గుంపు యుక్క ఘీంకార శబ్దములు భేరీ వాయిద్య ధ్వనితో కలిసి శబ్దించు అలల సముద్ర ఘోషవలె అన్ని దిక్కుల ప్రతిధ్వనిస్తున్నాయి. శ్రీరంగనాథా, పడక నుంచి లేచి మాపై దయ చూపవయ్యా.
- తూర్పు దిక్కు నుండి వీచు చల్లని గాలి పూలతీగలపై నిండివున్న మల్లెలు, మొల్లల పూలవాసనలను గ్రహించి మంచి పరిమళ సువాసనాభరితముగా వీచుచున్నది ఇదిగో. పూలపడకన నిద్రించు హంసజంటలు తెల్లవారుఝామున పడే లే మంచు బిందువులతో తడిసిన తమ చక్కని అందమైన రెక్కలను విదిల్చి నిద్ర లేచినవి. మొసలి యొక్క తెల్లని కోరలకి చిక్కి, విపరీతముగా బాథపడిన గజేద్రుడి గొప్ప దుఃఖమును పోగొట్టిన శ్రీరంగనాథా, పడక నుంచి లేచి మాపై దయ చూపవయ్యా.
- ఆకాశమున అన్ని దిక్కులలోను సూర్య కాంతి వ్యాపించెను. నక్షత్రముల ప్రకాశము తగ్గినది. చల్లని వెన్నెలలను వెదజల్లు చంద్రుడు కాంతి విహీనుడయ్యెను. రాత్రి వ్యాపించిన ఘనమైన చీకటి అంతా పోయినది. ఉదయకాలపు పచ్చని తోటలు పోకచెట్ల తోపుల యుక్క వికసిత పుష్పముల పరిమళపు కమ్మటి గాలి సుతిమెత్తగా చల్లగా తాకుతూ పులకరింప చేయుచున్నది. అందమైన విశాలపు బలిష్ఠమైన చేతిలో కోటిసూర్య తేజస్సుతో ప్రకాశించే చక్రము గల శ్రీరంగనాథా, పడక నుంచి లేచి మాపై దయ చూపవయ్యా.
- ఆవులను, ఆవుదూడలను మేపుటకు అడవికి తీసుకొని వెడుతూ, గోపాలకులు ఊదు వెదురు వేణువుల వేణుగానము, ఆ గానమునకు అనుగుణముగా ఎద్దుల మెడలోని గంటల చప్పుడు లయబద్దముగా వినిపిస్తున్నవి. తోటల యందు తుమ్మెదలు గుంపులు గుంపులుగా చెదిరిపోవుచున్నవి. విశ్వామిత్రుడి గొప్ప యాగమును కాపాడి, సీతా స్వయంవరములో శివుని విల్లుని విరిచి సీతను పెళ్ళాడి కోదండమను ధనస్సుతో లంకాథిపతి రావణాసురుడిని, అతడి రాక్షస వంశమును నాశనము చేసి, బలమైన పెద్ద అయోథ్యా రాజ్యమును ఏలిన శ్రీరామచంద్ర, మమ్మల్ని రక్షించువాడా, శ్రీరంగనాథా, పడక నుంచి లేచి మాపై దయ చూపవయ్యా.
- పూలతోటల యందు పక్షులు కిలకిలారావములు చేయుచున్నవి.రాత్రివేళ పూర్తిగా పోయినది. ఉషోదయము అయినది. తూర్పుదిక్కున శబ్దించు సముద్ర ఘోష భూపాల రాగము వలె వినిపించుచున్నది. రంగురంగుల సీతాకోక చిలుకలు, తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఎగురుతూ, సన్నాయి వాయిద్యము వలె రాగయుక్తముగా పాడుతూ తిరుగుతున్నాయి. అద్భుత రంగులు కలిగి వికసించిన పరిమళపు పువ్వులతో అల్లిన అందమైన పూలమాలలను తీసుకొని వచ్చి, నీ దివ్య పాదములకు సమర్పించుటకై దేవతలు వచ్చిరి. కనుక సర్వేశ్వరా, విభీషణుడు సేవ చేసిన శ్రీరంగములో కొలువై వున్న శ్రీరంగనాథా, పడక నుంచి లేచి మాపై దయ చూపవయ్యా.
- ద్వాదశాదిత్యులు తమ మెరిసే కాంతులు వెదజల్లు విలువైన నవరత్న ఖచిత మణిమయ రథములలో వచ్చియున్నారు ఇరిగో. సర్వ నిర్వాహకులు అయిన ఏకాదశ రుద్రులు కూడా వచ్చియున్నారు ఇరిగో. గుర్రముల మీద, రథముల మీద మరుత్తులు వసువులు వచ్చి తమ ఆటపాటలతో గుమిగూడివున్నారు ఇరిగో. నెమలి వాహనముపై షణ్ముఖుడు వచ్చి వున్నాడు ఇదిగో. ఆ కుమారస్వామితో పాటు ఆయన సేనావాహిని కూడా వచ్చి నీ గుడి ముందు నిలిచిరి ఇరిగో. శ్రీరంగనాథా, పడక నుంచి లేచి మాపై దయ చూపవయ్యా.
- సర్వేశ్వరుడివి అయిన నీ దివ్య పాదపద్మములను సేవించుటకు అండ పిండ బ్రహ్మాండములలోని దేవతలు, వారి వారి పరివారము వచ్చిరి ఇరిగో. అధిక తపస్సంపన్నులు అయిన సనకాది బ్రహ్మర్షులు మరుద్గణములు వచ్చిరి ఇరిగో. ఐరావతము మీద ఇంద్రుడు వచ్చెను. నీ గుడి గోపురపు వాకిట గంథర్వులు కిక్కిరిసి వున్నారు. నీ భక్తులు, మునులు, యక్షులు వచ్చి నీ గుడి వాకిట కూర్చొని వున్నారు. వచ్చిన వారందరితో ఆకాశము, భూమి చాలకున్నది. శ్రీరంగనాథా, పడక నుంచి లేచి మాపై దయ చూపవయ్యా.
- రాత్రిపూటంతా నీకు చక్కగా నిద్ర పట్టాలని కిన్నెరులు, గంథర్వులు, మిగిలినవారందరూ కలిసి మృదంగము, మద్దెల, వీణ, వేణువు, తంతి వాయిద్యములతో పాడదగిన కీర్తనలు అన్నీ వినసొంపుగా పాడుతూ కమ్మటి రాగాలాపన చేస్తూ ఇక్కడే వుండిపోయిరి. తపస్సంపన్నులు, దేవతలు, చారుణులు, సిద్దులు నీ దివ్య పాద సేవ చేసుకోవాలని తపన పడుతున్నారు. శ్రీరంగనాథా, అందుకే ఇప్పుడు వారందరికి నీ విశ్వరూప సేవ ప్రసాదించుటకు పడక నుంచి లేచి మాపై దయ చూపవయ్యా.
- సూర్యుడు అధిక ప్రకాశముతో ఆకాశమున సప్త వర్ణ కిరణములతో అలరారుతున్నాడు. ఆకాశము నుండి చీకటి పూర్తిగా పోయినది. శక్తిసంపన్నులు అయిన ఋషులు, తుంబుర నారదులు వచ్చి నిలిచిరి ఇరిగో. సర్వలోక అథిపతివి అయిన నీకు, స్వర్గలోకవాసులు పరిమళించు సుగంథ ద్రవ్యములను సమర్పించుటకు వచ్చి వున్నారు. నిన్ను నిత్యము సేవించువారు నిలువుటద్దమును నీ అవసరములకు కావలసిన వస్తువులను తీసుకొని వచ్చిరి. శ్రీరంగనాథా, పడక నుంచి లేచి మాపై దయ చూపవయ్యా.
- పరిమళించు ఎర్ర తామర పువ్వులు వికసించెను ఇదిగో.అలల తరంగముల సముద్రము నుండి ఆకాశములోకి పైపైకి లేచి సూర్యుడు ఎగసిపడి ప్రకాశించుచుండెను ఇదిగో. ఢమరకము వంటి సన్నని నడుములు కలిగిన ఈ వూరి స్త్రీలు వారి తలలను దువ్వి, కొప్పులు చుట్టుకొని చెరువు నీటిలో స్నానము చేసి, ఉతికి ఆరవేసిన చీరలను ధరించి , చెరువుగట్టు ఎక్కి ఇంటికి బయలుదేరిరి. కావేరీనది నీటితో చుట్టిన శ్రీరంగనాథా, తులసిమాలలతో నిండిన గూడ బుట్టను భుజమున ధరించి వచ్చిన తొండరడిప్పొడి అను పేరు గల నీ భక్తుడను, నీ స్నేహితుడను. నాపై దయ చూపి దేవర వారి భక్తులను తృప్తి పరచుటకు శేషశయ్య నుంచి లేచి మాపై దయ చూపవయ్యా.
తొండరడిప్పొడి ఆళ్వారుడి దివ్య పాదములకు నమస్కారములు.
Comments
Post a Comment