పురాణకాలంలో ధన్వంతరీ వైద్య విధానాలు
పురాణకాలంలో రోగాలు నయం కావటానికి చేసిన వైద్య విధానాలను గురించి అగ్నిపురాణం రెండువందల డెభ్బై తొమ్మిదో అధ్యాయం వివరిస్తోంది. ఈ వివరణను చూస్తే దానధర్మాలు కూడా ఆనాడు రోగాలు నయం కావటానికి ఉపయుక్తమయ్యాయన్న విషయం అవగతమవుతుంది. అలాగే తిన్న ఆహారం ఏమవుతుందన్న విషయాన్ని కూడా ఆనాటి వారు నిర్థారించిన అంశాలు కనిపిస్తాయి. వీటన్నిటినీ ధన్వంతరి వివరించాడు.
రోగాలు శారీరకాలు, మానసికాలు, ఆగంతుకాలు, సహజాలు అని నాలుగు రకాలుగా ఇక్కడ ధన్వంతరి వివరించి చెప్పాడు. జ్వరం, కుష్ఠులాంటివి శరీర రోగాలు. క్రోధాదులు మానసిక రోగాలు. దెబ్బలు తగలటం లాంటివి ఆగంతుకాలు. ఆకలి, ముసలితనం అనేవి సహజాలు. శరీర, ఆగంతుక వ్యాధులను తొలగించుకోవటానికి ధన్వంతరి చెప్పిన వైద్య పద్ధతులు ఈనాటి వారికి విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ఆనాడు అలా చెయ్యటం వల్ల ఆ రోగాలు తగ్గాయని రుజువులు కూడా పురాణాలు చూపిస్తున్నాయి.
శరీర, ఆగంతుక వ్యాధులు సంక్రమించినప్పుడు శనివారం నాడు పండితుడిని పూజించి ఆయనకు నెయ్యి, బెల్లం, ఉప్పు, బంగారం, దానం చేసేవారు.
సర్వరోగ విముక్తికి సోమవారం నాడు వేదపండితుడికి అభ్యంగన స్నానం చేయిస్తుండేవారు. అలాగే శనివారం నాడు తైలదానం చేసేవారు. ఆశ్వియుజ మాసంలో గోరసాలను దానం చేసేవారు. శివలింగానికి పెరుగు, నెయ్యిలతో స్నానం చేయించిన వాడు రోగ విముక్తుడవుతాడని ధన్వంతరి వివరించాడు. అలాగే రోగ విముక్తికి త్రిమధురాలలో గరికను ముంచి గాయత్రీ మంత్రంతో హోమం చేసేవారు. ఏ నక్షత్రంలో రోగం పుట్టిందో ఆ నక్షత్రంలోనే స్నానం చేసి దానాది విధులను నిర్వర్తించేవారు.
మానసిక రోగ విముక్తికి విష్ణుస్తోత్రాన్ని జపించేవారు. తిన్న ఆహారం లోపలికి వెళ్ళాక కిట్టంగానూ, రసభాగంగానూ మారుతుంది. కిట్టంగా అయినదే మూత్ర, స్వేద, దూషికాది రూపాలలోనూ, నాసిక, కర్ణాలు దేహం నుంచి వెలువడే మలరూపంగానూ పరిణమిస్తుంది. రసభాగమంతా రక్తంగా మారుతుంది. రక్తం నుంచి మాంసం, దాని నుంచి మేథస్సు, దాని నుంచి అస్తి, అస్తి నుంచి మజ్జ, దాని నుంచి శుక్రం, దాని నుంచి రాగ, ఓజస్సులు పుడతాయి. చికిత్సకుడు దేశకాల పీడా బలశక్తి ప్రకృతి భేషజ బలాలను గుర్తించి వాటికి అనుగుణంగా తగిన చికిత్సలు చెయ్యాలి.
చవితి, నవమి, చతుర్థశి తిధులలో మంద, క్రూర నక్షత్రాలను విడిచి చికిత్సను ప్రారంభించేవారు. విష్ణు, గోవు, వేదపండిత, చంద్ర, సూర్యాదుల పూజ చేసి రోగినుద్దేశించి బ్రహ్మదక్షుడు, అశ్వినీ దేవతలు, రుద్ర, ఇంద్ర, సూర్య, అనిల, అనల, రుషులు, ఓషధీ సముదాయం, భూత సముదాయం అన్నీ రక్షించు గాక. రుషులకు రసాయనం ఎలాగో, దేవతలకు అమృతం ఎలాగో, నాగులకు సుధ ఎలాగో అలాగే నీకు ఈ ఔషధం ఆరోగ్యకరమూ, ప్రాణ రక్షణకరమూ అగుగాక అనే అర్థాలు గల శ్లోకాలను పఠిస్తూ ఔషధాన్ని ఇవ్వటం ప్రారంభించే వారు.
ఆనాడు ఇలా కొన్ని కొన్ని రోగాలకు దైవపూజలు, దానాలు మాత్రమే చికిత్సలుగా ఉండేవి. కొన్ని కొన్ని రోగాలకు తగిన ఔషధులను కూడా ఇచ్చేవారిని ఈ అధ్యాయం వివరిస్తోంది.
Comments
Post a Comment