వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు . ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయవలెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానములు చేయవలెనని దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధ ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ ...