రథ సప్తమి సూర్య భగవానుని జన్మదినం. ఈ రథ సప్తమి రోజునే సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతక మణిని ప్రసాదించాడు. ఏడు కిరణాలుగా సప్తవర్ణాలను ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుని అశ్వాలు/ కిరణాలు ఈ రోజు ఒకే తెల్లని కాంతి రేఖగా మారుతాయి. అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారని పెద్దలు చెబుతారు.
సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత ఆరాధించువారు భారతీయులు.
మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆరోజున అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును.
ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.
Comments
Post a Comment