గోదాదేవి తండ్రి పెరియాళ్వార్ చరిత్ర
ద్రావిడ దేశంలోని వైష్ణవ మత ప్రవర్తకులైన
పన్నెండుమంది ఆళ్వారుల్లో ఒకరు పెరియాళ్వారు. అతడి అసలు పేరు విష్ణుచిత్తుడు.
ద్రవిడ దేశంలోని విష్ణుక్షేత్రాల్లో విల్లిపుత్తూరు ఒకటి. దీన్ని ‘ధ్వనిపురం’ అనీ పండితులు వ్యవహరించేవారు. ఈ క్షేత్రంలో మహావిష్ణువు వటపత్రశాయిగా వెలసి
ఉన్నాడు. వటపత్ర శాయిని ఆరాధిస్తూ విష్ణుచిత్తుడు విల్లిపుత్తూరులో నివసించేవాడు.
ప్రతినిత్యం వటపత్రశాయికి తులసి పుష్ప మాలికలను అల్లి కైంకర్యం చేసేవాడు.
విల్లిపుత్తూరు పాండ్యరాజ్యంలో ఒక గ్రామం.
పాండ్యరాజు మత్స్యధ్వజుడు. భోగలాలసుడు. ఒకరోజు ఆయన ప్రజల యోగక్షేమాలు
తెలుసుకోవడంకోసం రాత్రి మారువేషంలో నగర వీధుల్లో సంచరిస్తుండగా ఒక ఇంటి అరుగుమీద
కూర్చున్న పండితుడు కనిపించాడు. రాజు ఆ పండితుణ్ని ఏదైనా శ్లోకం వినిపించమని
అడిగాడు. అప్పుడు ఆ పండితుడు- వర్షకాలం జీవితావసరానికి సరిపడే వస్తువుల్ని తక్కిన
ఎనిమిది నెలల్లో సంపాదించుకోవాలి. రాత్రికి అవసరమైన వాటికోసం పగలు ప్రయత్నించాలి.
వృద్ధాప్యం నిశ్చింతగా గడుపుకోవడానికి యౌవనంలో సంపాదించి దాచుకోవాలి. పరలోకంలో
ఉత్తమ గతులకోసం ఈ లోకంలోనే ప్రయత్నం చెయ్యాలి అనే అర్థం వచ్చే శ్లోకం వినిపించాడు.
ఆ రాత్రికే అంతఃపురం చేరుకున్న రాజు మర్నాడు
ఉదయమే ఆస్థాన పండితుణ్ని పిలిపించి మోక్షప్రదమైన పరతత్వమేమిటో చెప్పమన్నాడు. ఆ
పండితుడు పండిత గోష్ఠిని ఏర్పాటు చేయమన్నాడు. రాజు తోరణ స్తంభానికి విలువైన
విద్యాశుల్కాన్ని మూటకట్టించి తత్వర్థ నిర్ణయం చేసిన పండితుడు ఆ శుల్కాన్ని
తీసుకోవచ్చునని ప్రకటించాడు.
విష్ణువు తన సతి లక్ష్మీదేవితో పాండ్యరాజుకు
జ్ఞానమార్గాన్ని విష్ణుచిత్తునిచే బోధింపజేస్తానని పలికాడు. విష్ణుచిత్తుడికి
సాక్షాత్కరించి రాజుకు జ్ఞానమార్గం ఉపదేశించమని ఆజ్ఞాపించి కార్యసాధనలో అతడికి
అండగా ఉంటానని పలికాడు. విష్ణుచిత్తుడు తాను పండితుణ్ని కానని, కేవలం తులసి మాలలతో స్వామిని అర్చించేవాణ్నని మనవి చేసుకున్నా- భగవంతుడు
ధైర్యం చెప్పాడు. విష్ణుచిత్తుడు తనకు వచ్చిన స్వప్నం తలచుకొని దేవుడు చెప్పింది
చేయడమే తన విధి అని భావించి మధుర రాజాస్థానానికి వెళ్లాడు.
సభలో అడుగుపెట్టిన విష్ణుచిత్తుణ్ని రాజు
ఉన్నతాసనంపై కూర్చోబెట్టాడు. అక్కడ పండితులు చాలామందికి విష్ణుచిత్తుడు
భగవద్దాసుడే కాని, శాస్త్రజ్ఞానం లేనివాడనే అభిప్రాయం ఉంది. కాని, రాజు ‘ఏ పుట్టలో ఏ పాముందో అతడి మాట విందాం’ అన్నాడు. విష్ణుచిత్తుడు లేచి నిలబడి వేద, ఉపనిషత్, స్మృతి, పురాణేతిహాసాల ప్రమాణంతో నిర్మల గంగాప్రవాహం
లాగా ప్రసంగించాడు. శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మమని, అందరిలో అంతరాత్మ ఆయనే అని విశిష్టాద్వైతాన్ని
స్థాపించాడు.
అదే సమయానికి దైవ సంకల్పంగా విద్యాశుల్కపు మూట
తెగిపడింది. రాజు విష్ణుచిత్తుణ్ని గజారోహణం చేయించి వూరేగించాడు. భక్తుడి సన్మానం
చూడటానికి సాక్షాత్తు విష్ణుదేవుడే ఆకాశమార్గాన వచ్చాడు. విష్ణుచిత్తుడికి ఈ
దర్శనం పరమానందం కలిగించింది. ‘పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు...’ అంటూ 12 పాశురాలు గానం చేశాడు. ‘వేల సంవత్సరాలు ఎర్రతామరల వంటి నీ పాదాల
అందానికి రక్ష కలగాలి. నీ సౌందర్యం చిరస్థాయిగా నిలవాలి’ అని కీర్తించాడు. అది ‘తిరుప్పుల్లాండు’గా ప్రసిద్ధమైంది. విష్ణుచిత్తుడు 461 పాశురాలతో ‘పెరియాళ్వార్ తిరుమొళి’ అనే పేరిట ప్రసిద్ధమైన ప్రబంధం రచించాడు. ద్రవిడ వేదాధ్యయనపరులు ‘తిరుప్పుల్లాండు’తోనే అధ్యయనాన్ని ప్రారంభిస్తారు.
విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి. ఆమె
రంగనాథుణ్ని వరించింది. కుమార్తె విరహ వేదనను అర్థం చేసుకోలేక విష్ణుచిత్తుడు
శ్రీరంగనాథుడికి మొరపెట్టుకుంటాడు. భూదేవి గోదాదేవిగా జన్మించింది.
శ్రీరంగేశ్వరుణ్ని పరిణయమాడింది. ‘ఆముక్త మాల్యద’గా ప్రబంధ నాయిక అయింది.
R. RAMA CHARYULU, PUJARI, Mayurmarg,Begumpet.mobile no:9989324294
Comments
Post a Comment