భారతదేశంలో వైష్ణవమతం వర్థిల్లిన విధానం చారిత్రకమైనది. శ్రీమద్రామానుజాచార్యులు వైష్ణవమత ప్రవర్తకులు. ఆయన స్థాపించినదే విశిష్టాద్వైతం. శంకరుల తర్వాత మతవిప్లవాన్ని తీసుకొచ్చిన వారిలో రామానుజులు అగ్రగణ్యులు. శంకరుల వలె రామానుజులు కూడా మత సంస్కరణవాదిగా నిలిచి, ఆనాటి మతంలో అనేక మార్పులకు కారకులయ్యారు. ఈయన విధానంలో భక్తి తత్వం ప్రాధాన్యత వహించింది.
శ్రీరామానుజులు పెరంబుదూరులో కేశవ సోమయాజి, కాంతిమతి పుణ్య దంపతులకు క్రీ.శ. 1017లో జన్మించారు. విద్యాభ్యాసం ఆరంభమైన కొద్దికాలానికే ఆయన మహా మేధావి అని అందరికీ అర్థమైంది. రామానుజుల విజ్ఞాన తృష్ణను చల్లార్చడానికి పెరంబుదూరులో తగిన గురువులు లేకపోవడంతో కాంచీపురం వెళ్లి యాదవ ప్రకాశ పండితుల వద్ద శిష్యునిగా చేరారు. అతి స్వల్పకాలంలోనే వేదాంత విద్యారహస్యాలు తెలుసుకుని గురువును మించిన శిష్యుడయ్యారు. వేదాల మీద ఆధారపడని మతాలను ఆయన వ్యతిరేకించారు. భక్తిప్రపత్తులు లేని వట్టి జ్ఞానమార్గం వల్ల అంతగా ఉపయోగం లేదన్నది రామానుజుల అభిప్రాయం. ‘విశిష్టాద్వైత దర్శనం కేవలం ఊహాజనితమైన ప్రతిపాదన కాదు. అది ఆచరణయోగ్యమైన అనుభవాన్ని అందించే వేదాంత దృక్పథం. అంటూ తన అపూర్వ వాదనా పటిమతో మహా తత్వవేత్త అయిన యాదవ ప్రకాశకుల వారినే మెప్పించి తన సిద్ధాంతాన్ని ఆచరించేలా చేశారు. సంఘ సంస్కరణాభిలాషియై, హరిజనులు మొదలైన వారికి వైష్ణవాన్ని ప్రసాదించి, సమాజంలోని ఇతర కులాలవారితో సమాన గౌరవం పొందేలా చేశారు. తన మార్గానికి మళ్లిన కులాల వారి సహకారంతో విశిష్టాద్వైతమతానికి విశేషమైన గుర్తింపు తెచ్చారు. కుల వ్యవస్థ జటిలంగా ఉన్న సమయంలోనే సంఘ సంస్కరణకు పూనుకున్నారంటే రామానుజులకున్న దూరదృష్టి ఎంత శక్తిమంతమైనదో తేటతెల్లమవుతోంది. మతవ్యాప్తితోపాటు శంకరునిలా సాహిత్యాన్ని సృష్టించిన రామానుజులు మహావిజ్ఞానిగా పేరుగాంచారు. భగవద్గీతకు, ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రాశారు. బ్రహ్మసూత్రాలకు సైతం వ్యాఖ్యానం రాసి దానిని శ్రీభాష్యం అనే పేరుతో పిలిచారు. వంశనామంగా కూడా ఇప్పటికీ ఇది విరాజిల్లుతోంది. ఒకానొకప్పుడు శైవకేంద్రంగా ఉన్న తిరుపతిని శంఖచక్రాలతో వైష్ణవక్షేత్రంగా మార్చివేశారు.దేశంలో పలుతావులకు ప్రయాణించి, అనేకమందిని శిష్యులుగా చేసుకున్నారు. అన్ని కులాల వారికీ మోక్షదాయకమైన వైష్ణవాన్ని ప్రసాదించిన ఘనత రామానుజాచార్యులవారిదే. ఆధునిక నాయకులకు, మతకర్తలకు మార్గదర్శకులై భారతదేశంలో ప్రజ్వరిల్లిన వైష్ణవ సాంప్రదాయాలకు పునాది వేసిన రామానుజులను తలవని వైష్ణవుడు వుండడని చెప్పడం అతిశయోక్తి కాదు.‘భగవంతుడూ మన ప్రాణాలకు ప్రాణం. భగవంతునికి తనను తాను అర్పించుకున్నవాడే నిజమైన భక్తుడు. భగవంతుణ్ణి నమ్మకపోవడమంటే తనయందే తనకు నమ్మకం లేదన్నమాట. మన విజ్ఞానానికంతటికీ పరమార్థం ఆ పరమాత్మే. మనం ఆయనలో ఉన్నాం. ఆయన మనలో ఉన్నాడు. నిస్సహాయులకు, నిర్భాగ్యులకు సేవ చేయడానికే మన జన్మలు ఉద్దేశించబ డ్డాయి. మానవ సేవలో నిమగ్నం కావడమే నిజమైన ఆధ్యాత్మికత్వం అని ఉద్బోధించిన మహనీయ కారుణ్యమూర్తి, మానవతావాది శ్రీ రామానుజాచార్యులు
ఈయన జన్మ దినం నాడు వారు రచించిన పుస్తకాలు చదివే ప్రయత్నం చేద్దాం. ..
Comments
Post a Comment