శని త్రయోదశి అంటే :- శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతోను, నువ్వుల నూనేతో, నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు.
నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి.
నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది.
శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు
నీలాంజన సమభాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరం.
అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.అలాగే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే, లేదా వింటే కూడా శనీశ్వరుడు తృప్తి పడతాడు. మనలని రక్షిస్తాడు.
* వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి.
* అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి.
* ఎవరితోను వాదనలకు దిగరాదు.
* ఆ రోజు ఆకలితో ఉన్న వారికి , పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.
* ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
* గోమాతకు, మూగ జీవులకు ఆహార గ్రాసలను, నీటిని ఏర్పాటు చేయాలి.
* కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి.
* అనాధలకు, అవిటి వారికి, పేద వితంతువులకు, పేద వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి ఏదో రూపంగా సహయపడాలి.
* జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి.
* ప్రతి రోజు తల్లిదండ్రులకు పాద నమస్కారం చేసుకోవాలి.
* అత్త మామలను , వంట చేసి వడ్డించిన వారిని , మన మేలు కోరేవారిని , ఉద్యోగం ఇప్పించిన వారిని , ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు.
* ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను , భవ బంధాలను మరువరాదు. ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు.
Comments
Post a Comment