తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు.
.దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు.శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు.ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.
పేలాల పిండి వెనుక ఆరోగ్య రహస్యం ఇదే..
తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.
Comments
Post a Comment