ఏటా జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠానక్షత్రానికి ముగిసేలా మూడు రోజులపాటు జరిగేదే ఈ ఉత్సవం.
అంగాలు (నేత్రాలు, ముక్కు, చెవులు వంటివి), మహాంగాలు(శిరస్సు, కంఠం, ఉదరం, బాహువులు వంటివి), ఉపాంగాలు (కేశాలు, నఖం వంటివి), ప్రత్యాంగాలు (శంఖుచక్రాలు, మకుటం, పీఠం వంటివి) తరుగులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా జరగకుండా చూసేందుకు ఉత్సవమూర్తిని రక్షించే ప్రక్రియను భృగువు క్రియాధికారంలో వివరించారు. ఆ రక్షించే ప్రక్రియే జ్యేష్ఠాభిషేకం. దీన్ని సుగంధ తైల సమర్పణోత్సవం, అభిదేయక అభిషేకం అని కూడా పిలుస్తారు.చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో కలిసి ఉన్న మాసంలో విశేషమైన సుగంధతైల సమర్పణం చేయాలని భృగువు వివరించారు. దీనివల్ల విష్ణుమూర్తి దివ్య తేజస్సుతో వెలుగొందుతారని చెప్పారు. దీని ప్రకారమే జ్యేష్ఠాభిషేకం జరుగుతోంది.
జ్యేష్ఠాభిషేకం ప్రారంభంనాడు యధావిధిగా సుప్రభాతం, నామార్చన, నైవేద్యం, ఉచ్ఛవ మూర్తి గర్భాలయం నుంచి వేంకటరమణ కల్యాణమంటపానికి చేరుకుంటారు.. శతకలశప్రతిష్ఠ, ఆవాహన, తర్వాత నవకలశ ప్రతిష్ఠ, ఆవాహన పూజలు నిర్వహిస్తారు. తర్వాత నివేదనలు, హారతులు సమర్పించి కంకణ ప్రతిష్ఠ చేస్తారు.
అనంతరం స్వామివారికి ఆర్ఘ్యపాద ఆచమనీయం సమర్పించి కంకణధారణ చేస్తారు.
వేద పండితులు శ్రీసూక్తం, పురుషసూక్తం, భూసూక్తం వంటివి పఠిస్తుండగా శుద్ధ జలాలలో అభిషేకం చేస్తారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుసు నీళ్లతో, శతకలశాల్లోని జలాలతో స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. చివర్లో స్వామి, అమ్మవార్లను చందనంతో అలంకరిస్తారు.
తర్వాత నవ కలశాల్లోని జలాలతో అభిషేకిస్తారు. ఆ జలాలను అర్చకస్వామి శిరస్సుపై చల్లుకుని భక్తులందరిపై పురోభవ అని చిలకరిస్తారు. తర్వాత స్వామికి వస్త్రాలంకరణ, నివేదన జరుగుతాయి.
వివిధ సేవలు, ఉత్సవాలను జరిపించుకుంటూ భక్తులకు దర్శనమిచ్చే శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారు ఎప్పుడూ కవచాన్ని ధరించి ఉంటారు. కేవలం జ్యేష్ఠాభిషేక సమయంలోనే కవచాన్ని తొలగిస్తారు. ఈ ఒక్క సందర్భంలోనే నిజరూపంలో దర్శనమిస్తారు.
ఈ జ్యేష్ఠాభిషేకంలో మాత్రమే స్వామిని అన్ని ద్రవ్యాలతో అభిషేకిస్తారు.భక్తులందరికి తీర్థం ప్రసాదం ఇస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, మైత్రినగర్,మదీనగూడ, హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది.
Comments
Post a Comment