తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ మాసంలో ఇందిరా ఏకాదశి వచ్చింది. ఈ సమయంలో పితృ పక్షాలను జరుపుకుంటారు. ఈ ఏకాదశిని పితృ పక్షాలలో జరుపుకోవడం వల్ల మోక్షానికి మార్గం సులభమవుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయడం వల్ల వారికి విముక్తి లభించి.. వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. పూర్వీకుల విముక్తి కోసం ప్రతి ఒక్కరూ ఈ ఏకాదశి తిథి నాడు పూజలు చేయాలని పెద్దలు చెబుతారు.
ఇందిరా ఏకాదశి ప్రాముఖ్యత..
ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు కచ్చితంగా లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. శాస్త్రోక్తంగా మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఏదో ఒక కారణం వల్ల మోక్షం లభించకపోతే ఇందిరా ఏకాదశి వ్రతం చేసి దాని ద్వారా పొందిన పుణ్యాన్ని తమ పూర్వీకులకు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది. ఈరోజున పూర్వీకులన స్మరించుకుంటూ శ్రాద్ధం, తర్పణం సమర్పించే వారికి పితృ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.ఇందిరా ఏకాదశి రోజున ఏం చేయాలి..* ఈ ఏకాదశి తిథి నాడు పూర్వీకుల విముక్తిని కోరుకుంటూ దేవతల ముందు దీపం వెలిగించి, భగవద్గీతను చదవడం లేదా వినడం చేయాలి.
* భగవద్గీత మొత్తం చదవడం సాధ్యం కాకపోతే, కనీసం ఏడో అధ్యాయమైనా చదవాలి లేదా వినాలి.
* పూర్వీకుల విముక్తి కోరుకుంటూ దేవుడిని ఆరాధించాలి.
* సాయంత్రం వేళ తులసి చెట్టు ముందు నేతి దీపం వెలిగించాలి. ఆ తర్వాత పూర్వీకుల విముక్తి కోసం ప్రార్థించాలి.
* ఇందిరా ఏకాదశి రోజున రావి చెట్టు ఎదుట ఆవాల నూనెతో దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి కలగడంతో పాటు మనకు ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి.
ఏకాదశి పూజ తర్వాత మీ శక్తి, సామర్థ్యాల మేరకు బ్రాహ్మణులకు ఆహారం, పండ్లు, డబ్బులను దానం చేయాలి.
Comments
Post a Comment