గణానామ్ త్వా గణపతిగ్‌ం హవామహే
కవిమ్ కవీనా ముపమశ్రవస్తవమ్।
జ్యేష్ఠరాజమ్ బ్రహ్మణామ్ బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభి స్సీద సాదనమ్॥
టీకా: గణానామ్= గణముయందు; త్వా= నిన్ను; గణపతిగ్‍ం= గణపతిని; హవామహే= ఆహ్వానించుచున్నాము; కవిమ్= కవిని; కవీనామ్= కవులలో; ఉపమ= పోలికలో; అశ్రవస్-తవమ్= మిక్కిలి అధికుడయిన వానిని; జ్యేష్ఠ రాజమ్= పెద్ద రాజు అయిన వాడిని (రాజాధిరాజును); బ్రహ్మణామ్= బ్రహ్మణ్యులలో; బ్రహ్మణస్పతే= బ్రహ్మణస్పతివి; ఆ= అయిన; శృణ్వన్= ఆలకించి; ఊతిభిః= కోర్కెలు తీర్చువాడవై ; సీద= అలంకరించుము; సాదనమ్= ఆసనము/స్థానము.
తాత్పర్యం: గణములకు అధిపతివి, విద్వాంసులలో విద్వాంసుడవు, పోల్చదగిన కీర్తి శ్రేష్టులకు కూడా నీవే పోలికవు, బ్రహ్మణ్యులలో బ్రహ్మణస్పతివి, పెద్దరాజువు/రాజాధిరాజువు అయిన నీవు మా కోర్కెలు తీర్చుటకు, మా ప్రార్థన ఆలకించి ఈ పూజా సమయము నందు ఈ స్థానమును లేక ఆసనమును అలంకరించుము.
నిజానికి ఈ సూక్తానికి అధిదేవత బృహస్పతి/బ్రహ్మణస్పతి. ఈ సూక్తంలో మిగిలిన శ్లోకాలన్నీ బృహస్పతి/బ్రహ్మణస్పతిని ఉద్దేశించి రాసినవే. గణపతి అంటే ఇక్కడ జనసమూహానికి అధిపతి. అంతే. నిజానికి ఇంద్రుణ్ణి కూడా ‘గణపతి’ అంటూ ప్రస్తుతించే శ్లోకం ఋగ్వేదంలోని పదవ మండలంలోని 112వ సూక్తంలో కనిపిస్తుంది:
ని షు సీద గణపతే గణేషు
త్వం ఆహుర్ విప్రతమం కవీనామ్।
న ఋతే త్వత్ క్రియతే కిం చనారే
మహామ్ అర్కమ్ మఘవఞ్ చిత్రమ్ అర్చ॥
తాత్పర్యం: ఆసీనుడవు కమ్ము, గణములయందు గణపతివి; కవులయందు ఉత్తమ విప్రుడవు; నీ ప్రమేయం లేకుండా ఏమి జరగదు: ఓ మహాత్ముడా; అద్భుతమైన వాడా; మఘవంతుడా (శ్రీమంతుడా); ఈ స్తోత్రముతో నిన్ను అర్చించెదను.
Comments
Post a Comment