పితృ ఋణాన్ని
తీర్చే పర్వం పితృపక్షం. అదే ‘మహాలయం’గా ప్రసిద్ధి చెందింది. .మహం ఆలం యాత్ ఇతి
మహాలయం’ అని వ్యుత్పత్తి. చాలినంత తృప్తిని పితరులు ఈ పక్షంలో తమ పుత్రులు చేసిన
తర్పణాదుల ద్వారా పొందుతారు కనుక దీన్ని ‘మహాలయ పక్షం’ అని చెబుతారు.
‘‘అమావస్యే దినే ప్రాప్తే గృహద్వారాయే సమాశ్రితః
వాయుభూతాః
ప్రవాంఛతి శ్రాద్ధాం పితృగణానృణామ్- అని గరుడ పురాణం పేర్కొంటోంది. అమావాస్య దినం
రాగానే పితృ దేవతలు వాయు రూపంలో తమ వారి ఇళ్ళకు వచ్చి, సూర్యాస్తమయం వరకూ ఉండి, తమ వారు శ్రాద్ధ కర్మలు నిర్వహించి, అన్నదానాలు చేస్తే సంతృప్తి పొంది, ఆశీర్వదించి వెళ్తారట! లేకుంటే అసంతృప్తి చెంది, శాపనార్ధాలతో నిందించి, తిరుగుముఖం పడతారని గరుడ పురాణ వచనం.
మూడు ఋణాలు
ప్రతి మానవుడు
మూడు విధాలైన ఋణాలతో పుడతాడు. అవి దేవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ధర్మబద్ధమైన నిత్య నైమిత్తిక
కార్యాచరణలతో ఈ మూడు ఋణాల నుంచి విముక్తుడవుతాడు. ‘యజ్ఞేవ దేవేభ్యః’ అని శాస్త్ర వచనం. క్రతువులు చేయడం, చేయించడం ద్వారా దేవగణాలు సంతృప్తి చెందుతాయి. అలా దైవఋణం తీరుతుంది. ‘బ్రహ్మచర్యేణ ఋషిభ్యః’- అంటే బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి.
ఇక మూడవది పితృ
ఋణం. ‘ప్రజయా పితృభ్యః’ అని శాస్త్రవచనం. సంతానంతో పితృ ఋణం తీరుతుంది. ఇది పరంపరానుగతమైనది. దీనికి
విఘాతం కలిగించకూడదు. తగిన వయసులో వివాహం చేసుకొని, సంతానాన్ని పొందాలి. తద్వారా పితృ దేవతలకు పిండ
ప్రదానాలు, తర్పణాదులు నిర్వహించాలి. మనం ఎలాంటి పితృకార్యం నిర్వహిస్తున్నా ఐదుగురు పితృ
దేవతలు మన వాకిటి ముందు వాయురూపంలో నిరీక్షిస్తారు. వారు- తండ్రి, తాత, ముత్తాత, తల్లి తండ్రి, తల్లి తాత. వీరికి తర్పణాదులు, పిండ ప్రదానాలు తప్పక చేయాలనీ, అప్పుడే పితృ ఋణం తీరుతుందనీ పెద్దలు చెబుతారు. గరుడ పురాణం కూడా ఇదే
విషయాన్ని తెలియజేసింది.
పితృ యజ్ఞం
మహాభారతంలో, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు పితృ యజ్ఞాన్ని గురించి ధర్మరాజు కోరిక మేరకు
వివరంగా చెప్పాడు. ‘‘దైవ పూజ కన్నా పితృ పూజే గొప్పది. పితృ దేవతలతో పాటు దేవగణాలూ సంతృప్తి
చెందుతాయి. పితృ సమారాధనం సర్వ శుభసాధనం. ప్రతి అమావాస్య నాడు భక్తితో పితృ యజ్ఞం
నిర్వహించాలి. అలా చేస్తే సంవత్సరమంతా పితృయజ్ఞం నిర్వహించిన ఫలం ప్రాప్తిస్తుంది’’ అని తెలిపాడు. సాధారణంగా ప్రతి అమావాస్య నాడు లేదా పితరులు మరణించిన రోజున
శ్రాద్ధ కర్మలను మన పితృ దేవతలకు మాత్రమే పరిమితం చేస్తాం. కానీ, పితృ పక్షాలలోనూ, మహాలయ అమావాస్య నాడు సామూహిక శ్రాద్ధాలు... అంటే మన వంశంలోని పితృ దేవతలకూ, చనిపోయిన బంధు మిత్రులకూ, ఎంతమందికి వీలయితే అంతమందికి పిండ తర్పణాది
కార్యక్రమం నిర్వహించవచ్చు. . ఆ అమావాస్యను ‘మహాలయ అమావాస్య’ అని పేర్కొంటారు. ఈ పేరు వెనుక ఒక కథ మహా భారతంలో ఉంది.
కర్ణుడి నుంచి మొదలు!
కురుక్షేత్ర
సంగ్రామంలో మరణించిన కర్ణుని జీవాత్మ స్వర్గ మార్గంలో ప్రయాణం సాగించింది. కర్ణుడు
బ్రతికున్న కాలంలో అర్థించిన వారందరికీ లేదనకుండా దానం చేసి, దానకర్ణుడుగా కీర్తి గడించాడు. అలాంటి కర్ణుడికి మార్గమధ్యలో ఆకలిదప్పులు
కలిగాయి. చెట్టుకు పండిన పండును కోసుకు తిందామంటే, అది బంగారంగా మారింది! జలం తాగి ఆకలి
తీర్చుకుందామంటే దోసిలిలో నీరు బంగారమయింది! కర్ణుడికి ఏమీ అర్థం కాలేదు. తండ్రి
అయిన సూర్యుణ్ణి ప్రార్థించాడు. ప్రత్యక్షమైన సూర్యుడికి తన గోడు చెప్పుకొని, పరిష్కారం అడిగాడు.
అప్పుడు సూర్యుడు
‘‘నాయనా! నువ్వు దానకర్ణుడివే! అనుమానం లేదు. నీ సంపదనంతా దానం చేశావు. ఇంద్రుడు
కోరితే సహజ కవచ కుండలాలనే దానం చేశావు. కానీ, ఒక్క రోజైనా, ఒక్కరికైనా అన్నదానం చేయలేదు. దాని ప్రభావమే
ఇది!’’ అని చెప్పాడు. పరమాత్మ అనుమతితో కర్ణుడిని
సశరీరంగా భూలోకానికి పంపిస్తూ, అన్నదానం చేయాల్సిందిగా సూచించాడు. కర్ణుడు
సశరీరునిగా భూలోకానికి వచ్చిన రోజు భాద్రపద కృష్ణ పాడ్యమి. నాటి నుంచి పదిహేను
(పక్షం) రోజులపాటు ఆకలి గొన్నవారికి అన్నదానాలు జరిపాడు. బంధు మిత్రులకు శాద్ధ
కర్మలూ, తర్పణాదులూ నిర్వహించి, తిరిగి స్వర్గానికి పయనమయ్యాడు.
నాటి నుంచి
భాద్రపద మాస శుక్ల పక్షం దైవ కార్యాలకూ, కృష్ణ పక్షం పితృ యజ్ఞాలకూ పరిమితం అయ్యాయి.
కృష్ణ పక్షాన్ని మహాలయ పక్షంగా వ్యవహరిస్తారు. ఈ పక్షం రోజులూ పితృ యజ్ఞం
నిర్వహించాలనీ, వీలుకాని పక్షంలో అమావాస్య నాడు నిర్వహించాలనీ స్కాంద పురాణం చెబుతోంది. మన
తాత ముత్తాతలు తృప్తి చెందితే... వారి అనుగ్రహం వల్ల మన తరువాతి తరాలు అభివృద్ధి
చెందుతాయన్నది ప్రబలమైన ధార్మిక విశ్వాసం. ఆ కారణంగానే పితృ కార్యాలకు మన
శాస్త్రాలు అత్యంత ప్రాధాన్యం కల్పించాయి. శుభకార్యాలైన ఉపనయ, వివాహ సందర్భాల్లో కూడా పితరుల పట్ల శ్రద్ధా భక్తులు ప్రకటించే ఘట్టాలు చేటు
చేసుకుంటాయని గమనించాలి.
భాద్రపదమాస కృష్ణ
పక్షం మహాలయ పక్షం. ఈ రోజుల్లో శాస్త్ర విధిని అనుసరించి పితృ దేవతలను తృప్తి
పరచాలి. పితరుల తృప్తి కోసం ఈ పుణ్య క్రతువును యాచన చేసి అయినా నిర్వర్తించాలనీ, అది ధర్మ సమ్మతమేననీ శాస్త్రం చెబుతోంది. ‘‘ప్రతిఫలం ఆశించకుండా ఇలాంటి శ్రాద్ధ కర్మలు
విధిగా ఆచరించాలి. వంద యజ్ఞాలు చేసిన ఫలం కన్నా పితృ దేవతలకు తర్పణాలు విడవడం వల్ల
లభించే ఫలం ఎంతో ఎక్కువ’’ అని ఏనాడో మన మహర్షులు చెప్పారు.
Comments
Post a Comment