ఆర్థిక ఇబ్బందులుపడుతున్న వారు ఫాల్గుణ మాసం (తేదీ 3-3-2022 నుండి) లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే.. ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి.అలాగే శుక్ల ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువును ఆరాధించడం ఎంతో మంచింది. ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని అమలకీ ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే ఆయన అనుగ్రహం పొందొచ్చు. ఫాల్గుణ మాసంలో మొదటి పెన్నెండు రోజులు అంటే శుక్లపక్షపాడ్యమి మొదలు ద్వాదశి వరకూ శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన రోజులు. ప్రతి రోజూ తెల్లవారు ఘామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని శిరస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం శ్రీమహావిష్ణువును షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి పాలను నైవేద్యంగా సమర్పించాలి.
ఈ పన్నెండు రోజుల్లో ఒకరోజుగానీ లేదంటే ద్వాదశి నాడుగానీ వస్త్రాలు వివిధ దాన్యాలను గురువులకు లేదా గోమాతకు దానముగా ఇవ్వడం మంచిది. శక్తివున్నవారు ఏదైనా వైష్ణవాలయానికి ఆవును దానమివ్వడం విశేష ఫలితాలనిస్తుంది. పూర్ణిమనాడు పరమశివుడిని, శ్రీకృష్ణపరమాత్మను, మహాలక్ష్మినీ పూజించడంతో పాటూ "లింగపురాణం" ను దానముగా ఇవ్వడం మంచిది. అట్లే ఈనాటి సాయంత్రం శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపవలెను. దీనిని డోలోత్సవం అని అంటారు. దీనినే కొన్ని ప్రాంతాలలో డోలాపూర్ణిమ అని అంటారు. నరాడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం ఫాల్గున్యాం ప్రయతోభూత్వా గోవిందస్య పురంప్రజేత్ ఉయ్యాలలో అర్చింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈ రోజున దర్శించిన భక్తులకు వైకుంఠప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
అలాగే ఫాల్గుణ మాసంలో పితృదేవతలకు తర్పణం చేయడం మంచిది. తెల్ల నువ్వులు, నెయ్యి, ఆవాల నూనె, సీజనల్ ప్రూట్స్ వంటివి దానం చేస్తే ఎంతో మంచిది.
Comments
Post a Comment