దేవి శరన్నవరాత్రి. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దుర్గాష్టమిని మహాష్టమి లేక వీరాష్టమి అని కూడా అంటారు. మహిషాసురుని మీదకు అమ్మవారు దండెత్తి విజయం సాధించిన స్ఫూర్తితోనే పూర్వం రాజులు శత్రు రాజ్యాలపై దండయాత్రకు ఈ సమయాన్ని శుభ ముహూర్తంగా ఎంచుకున్నట్టు పురాణాల్లో పేర్కొన్నారు.
‘లోహుడు’ అనే రాక్షసుని దుర్గాదేవి సంహరిస్తే లోహం పుట్టిందని, కాబట్టే లోహాలతో తయారుచేసిన పరికరాలని పూజించే సంప్రదాయం కొనసాగుతోందని బలంగా నమ్ముతారు. ఇక దుర్గ అంటే? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయ్యింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపజేసేది", అని అర్థం. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు పటాపంచలవుతాయి. కాబట్టి, మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మీ ఆరాధనతో సిరిసంపదలు, చివరి మూడురోజులు సరస్వతీ ఆరాధనతో సకల బాధలు తలగిపోతాయి. అందుకే దుర్గాష్టమి రోజున దుర్గసహస్రనామ పారాయణం, 'దుం' అను బీజాక్షరంతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు.
Comments
Post a Comment