DASARA NAVARAATHRI సమస్త సృష్టిలో శక్తి ఉపాసనను మించింది లేదు. ఆ శక్తే- ఆది పరాశక్తి. ఆమె జగన్మూర్తి, బ్రహ్మ స్వరూపిణి, వేదవేద్య. ఆ దేవి సకల లోకాలకూ వందనీయగా విరాజిల్లుతోంది.
ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తికి ప్రతీకలుగా లక్ష్మి, సరస్వతి, పార్వతీ మాతల్ని పూజించే తొమ్మిది రోజులనూ ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు శరదృతువులో వచ్చేవి కనుక, ఇవి శరన్నవరాత్రులుగా ప్రసిద్ధమయ్యాయి. దేవిని ఆరాధిస్తారు కాబట్టి, ‘దేవీ నవరాత్రులు’ అనీ వీటిని వ్యవహరిస్తారు. పరాశక్తికి మరో పేరు- శారద. ఆ తల్లిని అర్చించే రాత్రులు కావడంతో, వీటికి ‘శారద నవరాత్రులు’ అనే పేరూ ఉంది. నవరాత్రి ఉత్సవాలు సంవత్సరంలో రెండుసార్లు వస్తాయి. చైత్రమాసంలో వచ్చేవి వసంత నవరాత్రులు. ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చేవి శరన్నవరాత్రులు. ఈ రెండు రుతువుల్లోనూ ఆదిశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.
దుష్టులైన రాక్షసుల్ని సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు. తొమ్మిది విధాలైన అనుష్ఠానాలు, విధి విధానాలతో తొమ్మిది రోజుల వ్రతదీక్ష చేపట్టిందని, ఆ శక్తి వల్ల కలిగిన అసమాన బలంతోనే పదో రోజున రాక్షసుల్ని మట్టుపెట్టిందని పురాణ కథనం.
అమ్మవారు మొదటి రోజున శైలపుత్రిగా, హైమవతిగా, పార్వతిగా పూజలందుకుంటుంది. ఒక చేతిలో కమలం, మరోచేత శూలం ధరించి దర్శనమిస్తుంది. రెండోరోజున బ్రహ్మచారిణి రూపంలో ఉంటుంది. కుడిచేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలంతో శ్వేత వస్త్రధారిణిగా శోభిల్లుతుంది. మూడోరోజున ఆమె- సింహవాహిని. ధనుస్సు, గద, శూలం, ఖడ్గం, పాశం వంటి ఆయుధాలు ధరిస్తుంది. పది చేతుల రూపంలో ఉండే అమ్మవారిని జయం, ధైర్యం, వీరత్వం కోసం భక్తులు పూజిస్తారు.
చక్రం, గద, బాణం ఒకవైపు; కమండలం, అమృత కలశం, జపమాల, పద్మం వంటివి మరోవైపు ధరించిన మాత నాలుగోరోజున దర్శనమిస్తుంది. ఎనిమిది భుజాలు కలిగిన ఆమెను ‘అష్ట భుజ దేవి’గా ఆరాధిస్తారు. ఆ దేవిని పూజిస్తే ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని భక్తులు విశ్వసిస్తారు. సింహవాహినిగా ‘స్కంద మాత’ పేరిట అయిదో రోజున పూజిస్తూ, శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. ఆరో రూపం- కాత్యాయని. కాత్యాయనుడనే ముని ముందుగా పూజించడం వల్ల ఆమెకు ఆ పేరు వచ్చింది. త్రిమూర్తుల తేజంతో మహిషాసురుణ్ని సంహరించడానికి అవతరించిన రోజు అది!
అమ్మవారి ఏడో రూపం- దుష్టులకు భయంకరి, శిష్టులకు అభయంకరి. ఎనిమిదో రోజు రూపం- మహా గౌరి. ఆ రోజున ఆమె శ్వేత వస్త్రధారిణి. అభయ, వరద ముద్రలతో పాటు చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. తొమ్మిదో రోజున ‘సిద్ధి ధాత్రి’ రూపం. సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. కమలాసని అయిన ఆ దేవి చతుర్భుజాల్లో శంఖం, చక్రం, గద, పద్మం ధరించి ఉంటుంది. ఈ తొమ్మిది రూపాలకూ ‘నవదుర్గలు’ అని పేరు!
తిథుల హెచ్చుతగ్గుల వల్ల, ఒక్కోసారి పదమూడు రోజులు ఈ ఉత్సవాలు జరుపుతుంటారు. నవరాత్రుల్లో- దుష్టశిక్షణ చేసి, శిష్టరక్షణ చేసే అమ్మవారిని సహస్రనామ స్తోత్రంతో, షోడశోపచార పూజలతో ఆరాధించడం తరతరాల సంప్రదాయంగా వస్తోంది.
దేశంలోని పలు ప్రాంతాల్లో, పలు రీతుల్లో ఈ దసరా ఉత్సవాల్ని నిర్వహిస్తారు. దేవి అర్చనలు, శమీ వృక్ష పూజలు, ఆయుధ పూజలు- సకల ఐశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, సుఖశాంతులను, విజయ పరంపరను ప్రసాదిస్తాయన్నది భక్తకోటి ప్రగాఢ విశ్వాసం!
Comments
Post a Comment