చైతన్య శక్తి చేసే జన్మ యాత్రల్లో మానవ జన్మ అత్యున్నతమని విజ్ఞులు చెబుతారు. ఒక విత్తనం మొలకగా వెలువడి, మొక్కగా మారి, ఆ తరవాత కొమ్మకు పువ్వుగా పూయడం వంటిదే మనిషి జన్మ. పుణ్యఫలం వల్లనే మనిషిగా పుట్టే అదృష్టం లభిస్తుందంటారు.కొండ అడ్డు వచ్చిందని నది ఆగిపోతుందా? లేదు. అప్పుడు నది పక్కమార్గం వెతుక్కొని సాగిపోతుంది. ఆ కొండ చుట్టూ పారే నది- ప్రకృతి శోభను మరింత పెంచుతుంది. అలాగే, ఉలితో చెక్కితేనే కఠిన శిలైనా సుందర శిల్పంగా మారుతుంది. వెదురు కర్ర అయినా, దాన్ని మురళిగా మారిస్తే మధుర గానం వినిపిస్తుంది. ఆ అమృతంతో లోకాన్ని ఓలలాడిస్తుంది. కష్టాలకు ఎదురొడ్డి, కాలాన్ని ఈదే వారే విజేతలుగా నిలుస్తారు. సమాజమూ వారినే గౌరవిస్తుంది. వారికి అది గొప్ప ఆనందాన్నిస్తుంది.
అజ్ఞానంతో ఉన్నంత కాలం జీవితం అంధకారమయమే! అందువల్ల, జీవితానికి అర్థం తెలియజేసే విలువైన పుస్తకాల్ని మనిషి బాగా చదవాలి. మంచి మాటలు వినిపించే సత్సంగాలకు వెళ్లాలి. ఆధ్యాత్మిక బోధనల్ని శ్రద్ధగా వినాలి. ప్రతి పనినీ దైవంలా భావించి చేయాలి. జీవితానికి ఆ ఎరుకే పునాది! మనిషి ప్రతి క్షణాన్నీ ధ్యానంతో సద్వినియోగం చేసుకొన్నప్పుడు, ఆ పయనంలోని అణువణువూ జీవనోత్సవమే!
Comments
Post a Comment