సంస్కృత భాషలో ఆదికవి అయిన మహర్షి వాల్మీకి జయంతి నేడు 16-10-2016 ఆదివారం.
వాల్మీకి గొప్ప మహర్షి,తపఃశాలి. ఈయన రచించిన వాల్మీకి రామాయణాన్నే భారతీయులు ప్రామాణికంగా తీసుకుంటారు.
రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకికి ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . ఆయన తన కుటుంబాన్ని పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారుల సొత్తును దోచుకుని జీవితం గడిపేవారు. ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను …..కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ప్రశ్నిస్తారు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు. నారదుడు రామనామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తారు.
ఉపదేశం తర్వాత ఆయన జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోయారు చుట్టూచీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తారు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా వాల్మీకి అనే పేరుతో పిలుస్తాడు. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యారు. తపఃసంపన్నత తర్వాత వాల్మీకి ఆశ్రమవాసం చేయసాగారు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలకు జన్మనిచ్చినట్లూ..తెలుస్తుంది.
మనకి ప్రామాణికతను అందించిన వాల్మీకి మహర్షిని ఈ రోజున మనసారా స్మరించుకుందాం.
Comments
Post a Comment