శ్రీమన్నారాయణుడు భక్తవత్సలుడు … తనని నమ్మిన భక్తులను కాపాడటం, తన ప్రధమ కర్తవ్యం అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ వుంటాడు. లోక కల్యాణం కోసం అనేక అవతారాలను ధరించడం … తన భక్తులకు ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది.
అలాంటి శ్రీమన్నారాయణుడిని ‘ఏకాదశి’ రోజున పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘పరివర్తన ఏకాదశి’ అనే పేరు కూడా వినిపిస్తూ వుంటుంది.
‘భాద్రపద శుద్ధ ఏకాదశి’ ని … ‘పరివర్తన ఏకాదశి’ గా పిలుస్తుంటారు.
తొలి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శేష శయ్యపై యోగ నిద్రలోకి జారుకున్న శ్రీమహావిష్ణువు, ఈ రోజున ఒక వైపు నుంచి మరో వైపుకి ఒత్తిగిల్లుతాడట.
ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు శయన భంగిమలో ఒకవైపు నుంచి మరోవైపుకి తిరుగుతాడు కనుక, దీనిని పరివర్తన ఏకాదశిగా పిలుస్తుంటారు.
ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి … ఉపవాస దీక్షను చేపట్టి … జాగరణకి సిద్ధపడి శ్రీమహావిష్ణువును పూజించవలసి వుంటుంది. ”ఓం వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ … పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ” అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని యధాశక్తి
పూజించడం వలన, అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
Comments
Post a Comment