పంటలు ఏపుగా పెరిగే కాలంలో ‘కార్తిక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని పర్వదినంగా ఆచరిస్తున్నాం.
పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు!
పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.
‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.
పంట పొలాలకు శత్రువులు ఎలుకలు. వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే, మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ!
Comments
Post a Comment