వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లు పురాణాలు చెప్తున్నాయి. కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతోంది. "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జనించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అటువంటి పవిత్ర పర్వదినమైన "అక్షయ తృతీయ" ఏ శుభకార్యాన్నైనా నిశ్చితంగా జరుపుకోవచ్చు. అంతేకాదు.. వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చును.
"వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,
దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా"
"అక్షయ తృతీయ" అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే "తృతీయ" తిథి అని అర్థం. ఆ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభకరమైన ముహూర్త కాలంగా భావిస్తారు. సూర్య చంద్రులు అత్యంత ప్రకాశమానంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా శుభాలను ప్రసాదిస్తుంది . అందుచేత ఈ రోజున పెళ్లితో పాటు అన్నీ శుభకార్యాలను జరుపుకోవచ్చు. ఇంకా ఈ రోజున వెండి బంగారాలను కొనుగోలు చేయడం చేస్తారు.
ఈ రోజున ఆర్జించిన జ్ఞానం, చేసిన దానాల ఫలం ద్విగుణీ కృతమవుతుందనీ , అత్యంత ఫలప్రదమవుతుందనీ నమ్మకం. ఉపవాస దీక్షల ద్వారా, పూజా కార్యక్రమాల ద్వారా భక్తులు ఈ రోజున దైవ ధ్యానంలో గడుపుతారు. నిత్యావసర వస్తువులనూ, వస్త్రాలనూ దానమిచ్చి తులసి తీర్థాన్ని విష్ణు మూర్తి విగ్రహంపై చిలకరిస్తూ స్వామిని పూజిస్తారు. అక్షయ తృతీయ నాడు చేసే గంగాస్నానం శుభ ఫలాలనిస్తుందని నమ్ముతారు.
వేద వ్యాసుడు చెపుతుండగా, విఘ్ననాయకుడైన వినాయకుడు అక్షయ తృతీయ నాడే మహాభారత కథను లిఖించే మహత్కార్యాన్ని ప్రారంభించాడని చెపుతారు. త్రేతాయుగం అక్షయ తృతీయ నాడు మొదలైందనీ , ఆనాడే పవిత్ర గంగానది దివి నుండి భూమికి దిగి వచ్చిందనీ మరో కథనం. ఈ రోజున విచ్చలవిడిగా బంగారాలు కొనేయడం కంటే.. వెండితో చేసిన వస్తువులు కొనడం మంచిది. బంగారు కొనేవారు స్థోమతను బట్టి కొనుక్కోవడం మంచిది.
Comments
Post a Comment