శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే
అంటూ రామనామ వైభవాన్ని ఈశ్వరుడు చెప్పాడు. చైత్రశుద్ధ నవమి, గురువారం, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో పగలు పన్నెండుగంటల సమయంలో యజ్ఞఫలంగా శ్రీరామచంద్రుడు దశరథుని భార్య కౌసల్యకు జన్మించాడు. శ్రీరాముడిగా ఆయన అవతరించి నేటికి ఒక కోటీ ఎనబైయొక్క లక్షల ఏడువేలసంవత్సరాలు గడిచాయి., సమర్ధత, బుద్ధి కుశలత, శరణు జొచ్చినవారికి అభయమివ్వడం, పెద్దలను, మిత్రులను గౌరవించటం, అసత్య మాడకుండటం, ఏకపత్నీ వ్రతం మొదలైనవి శ్రీరాముని గుణాలలో పేర్కొన తగినవి.
శేషతల్ప సుఖ నిద్రితుడు, సర్వ చరాచర పాలకుడు, శుద్ధబ్రహ్మ పరాత్పరుడు, సమస్త లోకనాథుడు అయిన శ్రీమహావిష్ణువు ధర్మమార్గానికి గ్లాని సంభవించినప్పుడు, దుర్మార్గుల ఆగడాలు మితిమీరినప్పుడు, మంచివారికిరక్షణ కరువైనప్పుడు అవతారాలు ఎత్తి దుష్టశిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన చేస్తాడని భగవద్గీతలో స్వయంగా శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు. ముఖ్యంగా మనకు తెలిసిన దశావతారాలలో వామన, శ్రీరామ, పరశురామ, శ్రీ కృష్ణ అవతారాలు మాత్రం మానవ రూప అవతారాలు.
ఎత్తినది మానవావతారమైనా మాధ వుడిగా అతని కీర్తి సర్వ జగత్తులోనూ వ్యాపించింది. యుగాలు గడిచినా శ్రీరామచంద్రుడు ప్రజల మనస్సుల్లో మర్యాదా పురుషోత్తమునిగా నేటికీ నిలిచి ఉన్నాడు.
ఆదికవి వాల్మీకి మహాముని ముఖపద్మం నుండి వచ్చిన రామకథా మకరందాన్ని గ్రహించిన వారు జన్మ దుఃఖాన్ని, వ్యాధుల వల్ల వచ్చే బాధలను, ముసలితనంలో కలిగే బాధలను మరణ భయాన్ని పొందరు. శ్రీరామకథా పఠనం వల్ల అంతంలో విష్ణులోక ప్రాప్తి తథ్యమని మన పూర్వులు చెప్పారు. ఈ మహీతలంలో (భూమి) పర్వతాల, నదులూ ఎంత కాలం వరకు నిలిచి ఉంటాయో అంతకాలం దాకా శ్రీరామాయణం కూడా లోకాల న్నింటిలోనూ ప్రచారంలో ఉండగలదు. ఎందుకంటే రామాయణం లో హృదయాన్ని ద్రవింపచేసే చక్కని కథ ద్వారా మానవాళికి మార్గదర్శనం చేసే సుభాషిత రత్నాలు ఎన్నో చెప్పారు. మానవజాతి మనుగడ ఉన్నన్నాళ్ళూ ఈ కథ నిలిచి ఉంటుంది. పాతబడడమంటూ ఏ నాటికీ జరగదు. ఈ గ్రంథం మానవ జీవితాన్ని సుఖప్రదం చేసుకునేందుకు ఇతోధికంగా ఉపకరిస్తుంది. అంతటి మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షికి ధన్యవాదాలు తెలుపవలసిన దినం శ్రీరామ నవమి పర్వదినం.
ఈ పర్వదినాన్ని ఏ విధంగా జరుపుకోవాలి?
ఈ రోజున ఉపవాసవ్రతమాచరించాలి. వీలు కాని పక్షంలో ఏకభుక్తం చేయవచ్చు. ఉదయాన్నే స్నానాదికాలు పూర్తి చేసి ‘నవమ్యా అంగభూతేన ఏకభుక్తేన రాఘవ, ఇక్ష్వాకు వంశ తిలక ప్రీతి భవభవ ప్రియ’ అని సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత విధి విధానంగా పూజ చేసి గంధం పుష్పాక్షితలు కలిపిన నీటితో అర్ఘ్యమీయాలి. వడపప్పు పానకం ప్రసాదంగా స్వీకరించాలి. చైత్రశుద్ధ నవ రాత్రులు ఈ తొమ్మిది రోజులు రామాయణ గ్రంథ పఠనం చేయడం ముక్తికి సోపానం. లేదా సుందరాకాండ పారాయణ చేసినా అంతే ఫలితం ఉంటుంది.
సుందరకాండ పారాయణం
సుందరే సుందరో రామ
సుందరే సుందరీ కథా
సుందరే సుందరీ సీతా
సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం
సుందరే సుందరం కపిః
సుందరే సుందరం మంత్రం
సుందరే కిం న సుందరం
* * * * * * * *
సుందరాకాండ మంత్రం కూడా సుందరమైనదే. మహిమాన్వితమైనదే. శ్రీరామాయణ పారాయణం వేద పారాయణంతో సమానం. శ్రీరామచంద్రుడు పురుషోత్తముడే.
ఆపదామపహర్తారం,
దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం
* * * * * * * *
ఆపదలను పోగొట్టి సంపదలను కలిగించే లోకాభి రాముడైన శ్రీరామునికి పదే పదే నమస్కారం. శ్రీరామ కల్యాణ వేడుకలను ప్రసార మాధ్యమాలలో తిలకించడమూ ఫలదాయకమే.
Comments
Post a Comment