శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో " గరుడ పంచమి" ఒకటి. గరుత్మంతుడు సూర్యరధసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉన్నది.
తన తల్లి కోసం ప్రాణాలకు సైతం తెగించిన గరుత్మంతుడి కథ కనిపిస్తుంది. పూర్వం కశ్యప ప్రజాపతికి 'వినత - కద్రువ' అనే ఇద్దరు భార్యలు వుండేవారు. వినతకు పరాక్రమవంతుడైన వైనతేయుడు ( గరుత్మంతుడు) జన్మించగా, కద్రువకు పాములు జన్మించాయి. ఓసారి కావాలనే వినతతో కద్రువ పందెం కాసి, అన్యాయంగా ఆమెను గెలిచి తనకు దాసీగా నియమించుకుంది.
నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం.
ఉదయాన్నే తల స్నానం చేసి కొత్త వస్త్రములు ధరించి పూజా మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠంపై ముగ్గులు వేసి కొత్త వస్త్రమును వేసి బియ్యం పోయాలి. దానిపై గరుత్మంతుడి ప్రతిమను వుంచి షోడశోపచార పూజను నిర్వహించాలి. ధూప .. దీప ... నైవేద్య ... నీరాజనాలను సమర్పించాలి. చేతికి పది ముడులుగల తోరమును కట్టుకుని బ్రాహ్మణ సంతర్పణ చేయాలి. వారికి వాయనదానాలిచ్చి పంపిన తరువాత మాత్రమే ఆహారం తీసుకోవాలి.
తల్లి పట్ల అద్వితీయమైన ప్రేమానురాగాలను కనబరిచిన గరుత్మంతుడిని విష్ణుమూర్తి అభినందించి తన వాహనంగా చేసుకున్నాడు. గరుత్మంతుడు జన్మించిన ఈ శ్రావణ శుక్ల పంచమి రోజున ఆయనను ఆరాధించిన వారికి పరాక్రమవంతులైన బిడ్డలు కలుగుతారనీ, సకల శుభాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
Comments
Post a Comment